హైదరాబాద్ : తెలంగాణలో 'వన్ నేషన్- వన్ రేషన్ కార్డు' విధానం ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో ఈ విధానాన్ని కేంద్రమంత్రి రాంవిలాస్ పాసవాన్ ఢిల్లీ నుంచి ప్రారంభించారు. హైదరాబాద్లో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 'వన్ నేషన్ - వన్ రేషన్ కార్డు విధానం అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. నేషనల్ పోర్టబులిటీ తెలంగాణ - ఏపీ క్లస్టర్ ద్వారా సేవలందించనున్నట్టు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చన్నారు. దీనివల్ల హైదరాబాద్లో ఉంటున్న ఏపీ వాసులకు ఎక్కువగా లబ్ది చేకూరుతుందన్నారు. ఇదిలా ఉంటే వన్ నేషన్... వన్ రేషన్.. అంటే.. రేషన్ కార్డుదారులు దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. సొంతూర్లను వదిలి వలసవెళ్లిన వారు రేషన్ కు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ పోర్టబిలిటీని ప్రవేశపెట్టింది. వన్ నేషన్.. వన్ రేషన్.. శుక్రవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. ఏపీలో రేషన్ కార్డు ఉన్న లబ్దిదారులు తెలంగాణలో కార్డు ఉన్న వారు ఏపీలో రేషన్ సరుకులు తీసుకోవచ్చు. దేశంలో ప్రజలు ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునేలా 'ఒకే దేశం-ఒకే కార్డు' పేరుతో 2020 జూన్లోగా దేశవ్యాప్తంగా అమలుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ విధానం అమల్లో ఉంది. దీంతో ముందుగా తెలంగాణలోనే అమలు చేసేందుకు కేంద్రం రెడీ అయింది. . రేషన్ పోర్టబిలిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 2.82 కోట్ల మంది రేషన్ కార్డుదారులు లబ్ది పొందుతున్నారు. రాష్ట్రంలోని ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానాన్ని 2018 ఏప్రిల్ లో సీఎం కేసీఆర్ అమలు చేశారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో 2.07 కోట్ల మంది వినియోగించుకుంటుండగా? అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 42లక్షలు, మేడ్చల్ జిల్లాలో 29 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 18 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 10 లక్షలు, వరంగల్ జిల్లాలో 9 లక్షల మంది కార్డుదారులు రేషన్ సరుకులను తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోర్టబిలిటీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కార్డుదారులు - వరంగల్ జిల్లాలో లక్షలాది సంపూర్ణంగా అధ్యయనం చేసింది. పోర్టబిలిటీతో మంచి ఫలితాలు రావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ముందుగా ప్రయోగాత్మకంగా ఆగస్టు నుంచి నాలుగు రాష్ట్రాల్లో పోర్టబిలిటీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఏపీ, తెలంగాణ, రాష్ట్రాలను ఒక క్లస్టర్గా.. గుజరాత్, మహారాష్ట్రలను రెండో క్లస్టర్గా ఏర్పాటు చేసింది. మొదటి క్లస్టర్లోని ఏపీ, తెలంగాణలోని లబ్దిదారులు ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. రెండో క్లస్టర్లోని గుజరాత్, మహారాష్ట్రలోని లబ్దిదారులు ఈ రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునేలా.. చర్యలు తీసుకున్నారు. అయితే ఆహార భద్రత కార్డుకు ఆధార్ కార్డు లింకై ఉన్న లబ్దిదారులకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. కేంద్ర పౌరసరఫరాల శాఖ నిర్దేశించిన బియ్యం, గోధుమలు, చిరు ధాన్యాలను నిర్ణయించిన ధరల ప్రకారం లబ్దిదారులకు సరఫరా చేస్తారు. " ప్రతి ఒక్కరికి 3 రూపాయలకు కిలో బియ్యం చొప్పున 5 కిలోల బియ్యం, కిలో 2 రూపాయల చొప్పున గోధుమలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ రేషన్ షాప్లో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు.
ఏపీ, తెలంగాణల్లో.. ఎక్కడినుండైనా రేషన్