Kerala News

'ఉంగరాలు, తులసిమాలలు మార్చుకున్నాం'












తిరువనంతపురం : 'మేమిద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు పిల్లలను దత్తత తీసుకునేందుకు పోరాటం కొనసాగిస్తాం' అంటూ కేరళకు చెందిన నికేశ్‌ ఉషా పుష్కరన్‌, సోను తాము స్వలింగ సంపర్కులమన్న విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో తమ పెళ్లి విషయం బయటపెట్టే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఏడాది క్రితమే గురవాయర్‌ శ్రీకృష్ణ గుడిలో తాము వివాహబంధంతో ఒక్కటయ్యామని, తమ బంధానికి దేవుడు మాత్రమే సాక్షి అని తెలిపారు. ఈ విషయం గురించి నికేశ్‌ చెబుతూ..' మాది త్రిసూర్‌ జిల్లాలోని గురువాయూర్‌. నేను గతంలో ఓ వ్యక్తితో పద్నాలుగేళ్లు ప్రేమలో ఉన్నాను. పెళ్లి చేసుకుని మన బంధం గురించి అందరికీ చెప్పమని అతడిని అడిగాను. కానీ సమాజానికి భయపడి తను నాకు దూరంగా వెళ్లిపోయాడు. అలా దాదాపు రెండేళ్లపాటు నరకం అనుభవించాను. అందరిలాగా మాకు ప్రత్యేక మ్యాట్రిమొనీలు లేవు. అందుకే వ్యాపారంలో కాస్త తీరిక దొరికితే చాలు బెంగళూరు, తిరువనంతరపురం వెళ్లి నాకు నచ్చిన వ్యక్తి దొరుకుతాడేమోనని వెదికేవాడిని. అలా ఓ ఎల్జీబీటీ సంస్థ ద్వారా సోను పరిచయమయ్యాడు. తను నాకంటే ఐదేళ్లు చిన్నవాడు. రెండు రోజుల చాటింగ్‌ చేసిన తర్వాత ప్రత్యక్షంగా తనను చూశాను. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.